Chiranjeevi: అప్పుడు చనిపోదాం అనుకున్నా.. నేను బతకాలని అన్నయ్య అన్నాడు: పవన్ కల్యాణ్
- ఇంటర్‌లో తప్పినప్పుడు గన్ తీసుకుని కాల్చుకోవాలనుకున్నా
- అన్నయ్యను ఎలాంటి సినిమాలో చూడాలనుకున్నానో అలాంటిదే సైరా
- అన్నయ్య నాకు స్ఫూర్తి ప్రదాత
ఇంటర్మీడియట్‌లో ఫెయిలై చనిపోవాలని అనుకున్నప్పుడు అన్నయ్య చిరంజీవి తాను బతకాలని, తన దారి వేరే ఉందని చెప్పాడని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతున్న టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి బర్త్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ భావోద్వేగంగా మాట్లాడారు.
తనకు ఇది ఎంతో ప్రత్యేకమైన రోజని, అన్నయ్యను ఓ అభిమానిగా ఎలాంటి సినిమాలో చూడాలనుకుంటున్నానో అలాంటి సినిమానే ‘సైరా’ అని పేర్కొన్నారు. జీవితంలో తాను దారితప్పకుండా మూడుసార్లు కాపాడిన అన్నయ్య తనకు స్ఫూర్తి ప్రదాత అని పవన్ కొనియాడారు. ఇంటర్మీడియట్ తప్పినప్పుడు అన్నయ్య దగ్గర గన్ తీసుకుని కాల్చుకోవాలని అనిపించిందని తెలిపారు.
నిరాశగా ఉన్న తనను చూసి.. తాను బతకాలని, తన బతుకు ఇంటర్‌లో లేదని, వేరే ఎక్కడో ఉందని అన్నయ్య చెప్పాడని పవన్ గుర్తు చేసుకున్నారు. తన దేశభక్తిని చూసి ఏదో ఒక రోజు ఉద్యమకారుడు అవుతాడని అన్నాడని పేర్కొన్నారు. భగవంతుడివైపు వెళ్లడం వల్ల సమాజానికి ప్రయోజనం ఉండదన్న అన్నయ్య మాటలే ఈ రోజు మీ ముందు నిలబెట్టాయని పవన్ పేర్కొన్నారు.