cogress: ఎట్టకేలకు అఙ్ఞాతం వీడిన కాంగ్రెస్ నేత.. 'ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం తనకు లేదన్న చిదంబరం
- నిన్న సాయంత్రం నుంచి అఙ్ఞాతంలోకి వెళ్లిన చిదంబరం
- కొంచెం సేపటి క్రితం ‘కాంగ్రెస్’ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యక్షం
- తనకు, కుమారుడికి ఈ కేసుతో సంబంధం లేదన్న చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నిన్న సాయంత్రం నుంచి అఙ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎక్కడ ఉన్నారో తెలిసింది. ఇరవై నాలుగు గంటల తర్వాత అఙ్ఞాతం వీడిన చిదంబరం, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో కొంచెం సేపటి క్రితం ప్రత్యక్షమయ్యారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రంతా తాను తన లాయర్లతో ఉన్నానని, చట్టాన్ని గౌరవిస్తానని, దర్యాప్తు సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలని కోరారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాను నిందితుడిని కాదని, చార్జిషీట్ లో కూడా తన పేరు లేదని అన్నారు. తనకు, తన కుమారుడికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు దుష్ప్రచారం చేశారని అన్నారు.