Kodela: అందుకే నాపై జగన్ కు కక్ష: కోడెల కీలక వ్యాఖ్యలు
- టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించలేదు
- ఇప్పుడు ప్రతీకార రాజకీయాలతో ఇబ్బందులు పెడుతున్నారు
- ఫర్నీచర్ విషయంలో ఎటువంటి విచారణకైనా సిద్ధం
- గుంటూరులో మీడియాతో కోడెల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించి, తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించనందునే తనపై వైఎస్ జగన్ కక్షను పెంచుకుని, ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విమర్శించారు. ఈ ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, హైదరాబాద్ నుంచి తెచ్చిన అసెంబ్లీ సామగ్రిలో కొంత భాగం తన సత్తెనపల్లి ఆఫీసుకు చేరిన విషయం నిజమేనని, వాటిని తీసుకెళ్లాలని తాను రెండుసార్లు లేఖ రాసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు తాను సెల్ ఫోన్లను, మందులను కూడా అమ్ముకున్నట్టుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
ఏపీ అసెంబ్లీ తనకు దేవాలయం వంటిదని, ఐదేళ్లపాటు తాను కేవలం పూజారిలా మాత్రమే పని చేశానని కోడెల వ్యాఖ్యానించారు. తాను ఏం చేసినా, నిబంధనల ప్రకారమే చేశానని స్పష్టం చేశారు. గెలిచిన తరువాత ప్రజలకు సుపరిపాలన అందించకుండా విపక్షంపై వేధింపులు సరికాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని, ఎల్లకాలమూ సీఎం పీఠంపై ఉంటానని జగన్ కలలు గంటున్నారని నిప్పులు చెరిగారు.
ఫర్నీచర్ వ్యవహారంపై తాను ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని వెల్లడించిన కోడెల, అసెంబ్లీ రికార్డులను ఓ మారు పరిశీలించాలని కోరారు. కొత్త అసెంబ్లీకి ఫర్నీచర్ ను సీఆర్డీయే సమకూర్చిందని, పాత ఫర్నీచర్ తన కార్యాలయానికి చేరిందే తప్ప, షోరూముకు కాదని స్పష్టం చేశారు. ఫర్నీచర్ వద్దని భావిస్తే, తాను డబ్బులిస్తానని చెప్పానని, కానీ అధికారులు విషయాన్ని పక్కనబెట్టారని అన్నారు.