Ilayaraja: ఇళయరాజా పాట లేకుండా నేను లేను: తనను తాను గడ్డి మొలకతో పోల్చుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- తన పాటలు పాడొద్దంటూ నోటీసులు పంపిన ఇళయరాజా
- ఇళయరాజా, ఎస్పీ బాలు మధ్య విభేదాలంటూ మొదలైన ప్రచారం
- ఇటీవలే మళ్లీ కలిసిపోయిన మిత్రద్వయం
ఇళయరాజా స్వరబ్రహ్మ అయితే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానగంధర్వుడు. వీళ్లద్దరి కాంబినేషన్ లో ఎన్నో మధురమైన గీతాలు ప్రాణం పోసుకున్నాయి. వృత్తిని పక్కనబెడితే ఇళయరాజా, ఎస్పీబీ మంచి స్నేహితులు. అయితే, కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య సఖ్యత చెడింది. తాను స్వరపరిచిన పాటలను తన అనుమతి లేకుండా సంగీత కచేరీల్లో పాడొద్దంటూ ఇళయరాజా నోటీసులు పంపారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తాజాగా ఎస్పీ బాలు మాట్లాడుతూ, స్నేహ బంధంలో విభేదాలు మామూలేనని, ఇళయరాజా పాట లేనిదే తాను ఉండలేనని అన్నారు.
తాను సాధారణ గడ్డి మొలక వంటి వ్యక్తినని, ఇళయరాజాతో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. రాయల్టీ వివాదంతో స్వల్ప విభేదాలు వచ్చినా, తన వల్ల ఇళయరాజాకు ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు. త్వరలోనే ఇళయరాజా, ఎస్పీ కలిసి ఓ సంగీత విభావరిలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలసుబ్రహ్మణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు.