China: చైనాకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఒకేసారి 2,00,000 అకౌంట్ల సస్పెన్షన్!
- హాంకాంగ్ ఉద్యమకారులపై చైనా అక్కసు
- వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ పోస్టులు
- కఠినంగా వ్యవహరించిన ట్విట్టర్ యాజమాన్యం
హాంకాంగ్ లో నేరస్తులను చైనాకు తరలించే చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్ పౌరులు గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు. దీంతో ఇటు హాంకాంగ్ పోలీసులు, అటు ఆందోళనకారులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అయితే హాంకాంగ్ వాసులకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది మద్దతు తెలుపుతుంటే కొందరు మాత్రం వారిని ఉగ్రవాదులుగా ముద్రవేస్తున్నారు.
తాజాగా ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లపై ట్విట్టర్ కొరడా ఝుళిపించింది. చైనా ప్రభుత్వ ప్రోద్బలంతో విషం చిమ్ముతున్న 2,00,000 ట్విట్టర్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. అలాగే చైనా ప్రభుత్వం మద్దతున్న మీడియా కంపెనీల నుంచి ప్రకటనలను కూడా నిషేధిస్తామని ట్విట్టర్ ప్రకటించింది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో తాము ఇప్పటికే రెండు రష్యన్ మీడియా కంపెనీలపై నిషేధం విధించామనీ, పలు ఖాతాలను సస్పెండ్ చేశామని ట్విట్టర్ పేర్కొంది. తమ విధానాలను ఉల్లంఘించినందునే చైనాకు చెందిన 2 లక్షల ట్విట్టర్ ఖాతాలను రద్దుచేశామని కంపెనీ వివరణ ఇచ్చింది.
మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ స్పందిస్తూ.. హాంకాంగ్ ఉద్యమకారులను బొద్దింకలు, ఉగ్రవాదులుగా విమర్శిస్తున్న ఏడు పేజీలను, మూడు గ్రూపులను, ఐదు ఖాతాలను తొలగించామని ప్రకటించింది. చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్ కు స్వయం ప్రతిపత్తి ఉంది. చైనాలో ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియాలపై నిషేధం ఉండగా, హాంకాంగ్ లో అలాంటి నిషేధమేమీ లేదు.