Pakistan: ఓకే అనండి.. పాక్ లోకి దూసుకెళతాం... గతంలోనే కేంద్రం ముందు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రతిపాదన!
- పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం
- పుల్వామాపై దాడి తరువాత కేంద్రానికి చెప్పిన రావత్
- భూతల యుద్ధానికి అనుమతి లభించలేదని వ్యాఖ్య!
పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత పాకిస్థాన్ పై పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు ఇండియన్ ఆర్మీ రెడీ అయిందా? అంటే అవుననే సైనిక వర్గాలు అంటున్నాయి. బాలాకోట్ దాడికి ముందు సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కేంద్రం ముందు ఓ ప్రతిపాదన ఉంచారని, ఒక్కసారి అనుమతి ఇస్తే, తన సైన్యం పాకిస్థాన్ లోకి దూసుకు వెళుతుందని ఆయన చెప్పారని, అయితే, ఈ చర్చల తరువాత ఆయనకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం సంకోచించిందని తెలుస్తోంది.
గడచిన ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాపై భీకర ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆపై పాక్ కు గుణపాఠం నేర్పేందుకు వైమానిక దాడులతో పాటు అందుబాటులోని అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది. అదే సమయంలో రావత్, భారత సైన్యం సత్తా గురించి, సన్నద్ధత గురించి ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఇచ్చారు.
ఈ విషయాన్ని త్వరలో రిటైర్ అవుతున్న ఉన్నతాధికారులతో నిన్న సమావేశమైన రావత్, స్వయంగా బయటపెట్టారు. భూతల యుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని తాను స్పష్టంగా చెప్పినా, అందుకు అనుమతి లభించలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.