Bollywood: బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యం సాబ్ కన్నుమూత
- ఊపిరితిత్తుల సమస్యతో బాదపడుతున్న ఖయ్యం సాబ్
- గుండెపోటుతో కన్నుమూత
- ఉమ్రావో జాన్ చిత్రానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు
గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. ముంబైలోని సుజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలకు ఖయ్యం సంగీత దర్శకత్వం వహించారు. షోలా ఔర్ షబ్నం (1961), కభీ కభీ(1976), నూరీ(1979), ఉమ్రావో జాన్(1981), రజియా సుల్తాన్(1983), బజార్(1982) వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2007లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఖయ్యం సాబ్.. ఉమ్రావో జాన్ చిత్రానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మవిభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. ఖయ్యం మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన ఎన్నో అద్భుతమైన పాటలను స్వరపరిచారని, అవి ఎప్పటికీ పదిలంగా ఉంటాయని పేర్కొన్నారు.