Uma Shankar Ganesh: నర్సీపట్నంలో ఆరుగురు గర్భిణీలకు నిలిచిపోయిన ఆపరేషన్లు... వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్
- శస్త్రచికిత్స చేయాల్సిన సమయంలో అనెస్థటిస్ట్ గైర్హాజరు
- సెలవు పెట్టి అర్థంతరంగా వెళ్లిపోయిన మత్తుమందు నిపుణుడు
- ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే
విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో దిగ్భ్రాంతి కలిగించే సంఘటన జరిగింది. ప్రసవం కోసం ఆరుగురు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి రాగా, వారికి వైద్య పరీక్షలు చేసి శస్త్రచికిత్సలు నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. అయితే, వారికి మత్తుమందు ఇవ్వాల్సిన అనెస్థటిస్ట్ ఆపరేషన్ సమయానికి సెలవు పెట్టి వెళ్లిపోయాడు. తీరా ఆపరేషన్ చేయాల్సిన సమయంలో అనస్థీషియా నిపుణుడు లేకపోవడంతో డాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓవైపు తప్పనిసరి అయినా చేసేది లేక ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేశారు.
అయితే ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేశ్ వెంటనే స్పందించారు. వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అనకాపల్లి నుంచి ఇద్దరు అనెస్థటిస్ట్ లను రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అనెస్థటిస్ట్ లు రాగానే గర్భిణీలకు శస్త్రచికిత్సలు చేపడతామని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.