Jagannath Mishra: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నుమూత
- 82 ఏళ్ల వయసులో కన్నుమూసిన మిశ్రా
- క్యాన్సర్ తో పాటు ఇతర రుగ్మతలతో బాధపడ్డ మాజీ సీఎం
- బీహార్ రాజకీయాల్లో బలమైన నేతగా పేరుగాంచిన మిశ్రా
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ తో పాటు ఇతర రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2012లో ఆయన భార్య వీణ చనిపోయారు. ఆయన కుమారుడు నితీశ్ మిశ్రా రాజకీయాల్లో ఉన్నారు.
బీహార్ రాజకీయాల్లో బలమైన కాంగ్రెస్ నేతగా జగన్నాథ్ మిశ్రా పేరుగాంచారు. 1975లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన మిశ్రా... మూడు పర్యాయాలు ఆ పదవిని చేపట్టారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆధిపత్యం పెరిగిన తర్వాత కూడా మిశ్రా ప్రాభవం తగ్గలేదు.
1937లో జన్మించిన మిశ్రా... బీహార్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1983లో బీహార్ అసెంబ్లీలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ 2 గంటల పాటు ఏకధాటిగా ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు.
మిశ్రా మరణంతో బీహార్ శోకసంద్రంలో మునిగిపోయింది. మిశ్రా మరణం బీహార్ కు తీరని లోటు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నట్టు ప్రకటించారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, గతంలో సమస్తిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుడులో మరణించిన కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి ఎల్.ఎన్. మిశ్రాకు జగన్నాథ్ మిశ్రా తమ్ముడవుతారు.