Mughal: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 'బంగారు ఇటుక' ఇస్తానన్న మొఘల్ వారసుడు
- 1529లో బాబ్రీ మసీదును కట్టించిన బాబర్
- డిసెంబరు 1992లో కూల్చివేసిన కరసేవకులు
- బాబ్రీమసీద్-రామ్ జన్మభూమి భూమిపై సర్వహక్కులు తనవేనన్న టూసీ
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బంగారు ఇటుక ఇస్తానని మొఘల్ వారసుడు ప్రిన్స్ హబీబుద్దీన్ టూసీ ప్రకటించారు. మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడే టూసీ. అలాగే, బాబ్రీమసీద్-రామ్ జన్మభూమి భూమిని తనకు స్వాధీనం చేయాలని కోరారు. మొదటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్‌కు వారసుడిగా ఆ భూమిపై సర్వహక్కులు తనకు ఉన్నాయన్నారు. 1529లో బాబ్రీ మసీదును బాబరే కట్టించారని, కాబట్టి ఆ భూమి తనకే చెందుతుందన్నారు. కాగా, ఈ మసీదును 6 డిసెంబరు 1992న కరసేవకులు కూల్చివేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న కేసులో తన పేరును కూడా చేర్చాలని టూసీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అదింకా విచారణకు రాలేదు. ఈ కేసులో ఉన్న ఎవరికీ తమ వాదనను రుజువు చేసే సరైన పత్రాలు లేవని, కానీ, మొఘలుల వారసుడిగా ఆ భూమిపై తనకు హక్కు ఉందని, సుప్రీం కనుక భూమిని తనకు అప్పగిస్తే ఆలయ నిర్మాణానికి మొత్తం భూమిని ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్టు 50 ఏళ్ల టూసీ పేర్కొన్నారు.
టూసీ ఇప్పటికే మూడుసార్లు అయోధ్యను సందర్శించి అక్కడి ఆలయంలో ప్రార్థనలు చేశారు. గతేడాది ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఆలయ నిర్మాణానికి భూమిని అప్పగిస్తానని ప్రతిన బూనారు. అంతేకాదు, తన తలపై 'చరణ్-పాదుక’లు పెట్టుకుని రాముడి ఆలయాన్ని ధ్వంసం చేసినందుకు హిందూ సమాజానికి క్షమాపణలు తెలిపారు.