Jagan: జగన్ వైఖరి చూస్తుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ఉంది: తులసీరెడ్డి
- జగన్ అమెరికా పర్యటనపై పీసీసీ ఉపాధ్యక్షుడి విసుర్లు
- కుమార్తె సీటు కోసం జగనే వెళ్లనవసరంలేదన్న తులసిరెడ్డి
- రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు వరదలొస్తే సచివాలయంలోనే ఉండి పర్యవేక్షించారని వెల్లడి
పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఓవైపు రాష్ట్ర ప్రజలు కృష్ణా నది వరదలతో అల్లాడుతుంటే కుమార్తెకు సీటు కోసం ఏపీ సీఎం జగన్ అమెరికా వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. కుమార్తెకు సీటు కోసం ఆయనే స్వయంగా అమెరికా వెళ్లనవసరంలేదని, కుటుంబ సభ్యులను పంపినా సీటు ఇస్తారని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ వైఖరి చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
2009లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారీ స్థాయిలో వరదలు వచ్చాయని తులసిరెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో శ్రీశైలం ప్రాజక్టుకు 25 లక్షల క్యూసెక్కుల వరదనీరు రాగా, రోశయ్య సచివాలయంలోనే ఉండి వరద సహాయక చర్యలను, నీటి విడుదలను పర్యవేక్షించారని వివరించారు. మరోవైపు, చంద్రబాబు ఇల్లు నీట మునిగిందా లేదా అంటూ అధికారపక్షం, డ్రోన్లు ఎందుకు ఎగరేశారంటూ ప్రతిపక్షాలు వాదించుకోవడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.