Horse: తమ ఊరికి రోడ్డు లేదని ఉపాధ్యాయుడికి గుర్రాన్ని కొనిచ్చిన విశాఖ ఏజెన్సీ వాసులు

  • దట్టమైన అడవిలో కుగ్రామం
  • రహదారి సౌకర్యం లేక గుర్రంపై స్కూలుకు వస్తున్న టీచర్
  • తమ బిడ్డల భవిష్యత్తు కోసం గిరిజనుల తాపత్రయం

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దట్టమైన అడవి మధ్యలో అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే మన్యం గ్రామాలకు వెళ్లాంటే అదో ప్రయాస. ఏజెన్సీ ప్రాంతంలోని గెమ్మలి పంచాయతీ పరిధిలో సుర్లపాలెం కుగ్రామం ఉంది. ఇక్కడ ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ఇక్కడ పోస్టింగ్ వచ్చిన ఉపాధ్యాయులకు రవాణా పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. దానికితోడు సరైన కమ్యూనికేషన్ సదుపాయాలు కూడా ఉండవు.

ఈ నేపథ్యంలో గంపరాయి వెంకటరమణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సుర్లపాలెం స్కూలుకు బదిలీ చేశారు. గతంలో టీచర్ల మాదిరిగా కాకుండా వెంకటరమణపై గ్రామస్తులు బాగా నమ్మకం పెట్టుకున్నారు. యువకుడు కావడంతో కొత్త ఉత్సాహంతో పిల్లలకు పాఠాలు చెబుతుండడం చూసి సంతోషించారు. వాతావరణం ఎలా ఉన్నా వెంకటరమణ నిత్యం హాజరు అవుతుంటాడు. అయితే, వెంకటరమణ సుర్లపాలెం గ్రామానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడడం గమనించి గ్రామస్తులందరూ కలిసి అతడికి ఓ గుర్రాన్ని కొనిచ్చారు. ఆ గుర్రం ఖరీదు రూ.9000. ఇప్పుడా గుర్రం మీదే వెంకటరమణ నిత్యం పాఠశాలకు రాకపోకలు సాగిస్తుంటాడు.

మొదట్లో గుర్రపుస్వారీ తెలియకపోవడంతో కొంత అవస్థ పడినా, ఆ తర్వాత నిదానంగా అలవాటు చేసుకున్నాడు. ఇక దాని పోషణ విషయానికొస్తే గ్రామస్తులే చూసుకుంటున్నారు. వెంకటరమణ పాడేరులో నివాసం ఉంటాడు. ప్రతిరోజు గెమ్మల వరకు బైక్ పై వస్తాడు. అప్పటికే అక్కడ గిరిజనులు గుర్రంతో సిద్ధంగా ఉంటారు. రోజూ సుర్లపాలెం నుంచి గెమ్మల వెళ్లే ఎవరో ఒకరు ఆ గుర్రాన్ని తమతో తీసుకెళ్లి ఉపాధ్యాయుడు వచ్చే సరికి సిద్ధంగా ఉంచుతారు. ఆ గుర్రాన్ని ఎక్కి వెంకటరమణ పాఠశాల చేరుకుంటారు. తిరిగి ఆ గుర్రంపై గెమ్మల వరకు వెళతారు. అక్కడ సుర్లపాలెం గ్రామస్తులెవరైనా ఉంటే ఆ గుర్రాన్ని మళ్లీ గ్రామానికి తీసుకువస్తారు.

ఇది ఎంతో ప్రయాసభరితమైన తంతు అయినా, తమ బిడ్డల చదువు కోసం గ్రామస్తులకు తిప్పలు తప్పడంలేదు. ఈ దుస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు మార్గం వేయాలని ఉపాధ్యాయుడు వెంకటరమణ కోరుతున్నాడు.

  • Loading...

More Telugu News