united nations: పాక్‌కి షాక్‌... కశ్మీర్‌ సమస్య ద్వైపాక్షిక అంశం : తేల్చిచెప్పిన భద్రతా మండలి

  • కశ్మీర్‌ విషయంలో జోక్యానికి నిరాకరణ
  • అంతర్జాతీయ వేదికపై దాయాది దేశానికి భంగపాటు
  • చైనా ఒత్తిడిని పట్టించుకోని యూఎన్‌ఓ

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్దికల్‌ రద్దుపై నానా యాగీ చేస్తూ సమస్యను అంతర్జాతీయం చేయాలని చూస్తున్న దాయాది పాకిస్థాన్‌కు ఐక్యరాజ్య సమితిలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని తహతహలాడుతున్న పాక్‌కు, దాని మిత్ర దేశం చైనాకు ఐరాస భద్రతా మండలి గట్టి షాక్‌ ఇచ్చింది. కశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్థాన్‌కు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని మెజార్టీ సభ్యదేశాలు తేల్చి చెప్పాయి. మండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా విజ్ఞప్తి మేరకు మండలిలో నిన్న సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. గంట పాటు జరిగిన ఈ భేటీలో ఒక ప్రకటన కోసం చైనా పట్టుబట్టగా బ్రిటన్‌ మద్దతు పలికింది.

అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలతో జరిపిన చర్చల్లో భారత్‌ తన వాదనను సమర్థంగా వినిపించింది. సమావేశంలో అతిగా స్పందించడం వల్ల చైనాకు కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. ఆఫ్రికా దేశాలు, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్‌, రష్యాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్‌, పాక్‌ల మధ్య చర్చలు జరగాలని ఫ్రాన్స్‌ కోరింది. ఇండోనేసియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

దీంతో మెజార్టీ సభ్యులు ససేమిరా అనడంతో కశ్మీర్‌ అంశం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సమస్యని, ఆ రెండు దేశాలే తేల్చుకోవాలని  ఐక్యరాజ్య సమితి   తేల్చిచెప్పింది. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు భేటీ అనంతరం భద్రతా మండలికి నాయకత్వం వహిస్తున్న పోలండ్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.

భేటీ అనంతరం పాక్‌, చైనాల ప్రతినిధులు ప్రకటనలు చేసుకోవడాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తప్పుపట్టారు. చర్చలకు భారత్‌ ఎప్పుడు సిద్ధమని, ఉగ్రవాదాన్ని ఆపితే చర్చలు మొదలవుతాయన్నారు. భద్రతా మండలి భేటీలో చేదు అనుభవం ఎదురైనా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భెషజాన్ని వీడలేదు. కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఐరాసదేనని స్పష్టంచేశారు.

  • Loading...

More Telugu News