Andhra Pradesh: భీమవరంలో రూ.370 కోట్ల కుంభకోణం.. రంగంలోకి దిగిన సీబీఐ!
- పశ్చిమగోదావరి లోని భీమవరంలో ఘటన
- నకిలీ పత్రాలతో రుణాలు.. ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు
- ఈ జాబితాలో పలువురు రాజకీయ ప్రముఖులు
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. జిల్లాల్లో ఆక్వా సాగు పేరుతో కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ప్రైవేటు బ్యాంకులకు రూ.370 కోట్లు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. 370 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకున్నాక, సదరు వ్యక్తులు వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడంతో బ్యాంకులు సీబీఐ అధికారులను ఆశ్రయించాయని తెలుస్తోంది.
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భీమవరంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో తీసుకున్న రుణాల రికార్డులను సీబీఐ పరిశీలిస్తోందని చెప్పారు. కాగా, ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.