Crime News: బండి తోసుకు వెళ్తుంటే పెట్రోల్ అయిపోయిందనుకున్న పోలీస్: ప్రశ్నిస్తే నిజం తెలిసి షాక్!
- ద్విచక్ర వాహనా చోరీ నిందితుడిని పట్టించిన అనుమానం
బండి తాళం ఏదని ప్రశ్నించిన కానిస్టేబుల్
తడబడడంతో అసలు విషయంపై ఆరా
పోలీసులకు సునిశిత దృష్టి ఉండాలంటారు. దొంగను, దొరను ఒకే గాటన కట్టేయకున్నా దొరల్లా మసలే దొంగల ఆటకట్టించాలంటే సూక్ష్మ పరిశీలన తప్పనిసరి. ఆ కానిస్టేబుల్ చేసింది అదే. ఓ మధ్య వయసు వ్యక్తి బండి నడిపించి తీసుకువెళ్తుంటే ‘అయ్యో...దారి మధ్యలో పెట్రోల్ అయిపోయినట్టుంది’ అని తొలుత అతనూ అనుకున్నాడు. కానీ అతని పోలీసు కళ్లు అనుమానించడంతో ఆపి ప్రశ్నిస్తే అతనో దొంగని తేలి ఆశ్చర్యపోవడం అతని వంతయ్యింది.
వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ ఠానాలో భ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌గా సంతోష్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అశోక్‌నగర్ నుంచి ఇందిరాపార్క్ వరకు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఓ వ్యక్తి బండి తోసుకుంటూ వెళ్తూ కనిపించాడు. పెట్రోల్ అయిపోయి ఉంటుందని తొలుత అనుకున్న సంతోష్‌కుమార్ కళ్లు బండి తాళం కోసం వెతికాయి.
కనిపించక పోవడంతో అనుమానం వచ్చి బండి నీదేనా అని ప్రశ్నించాడు. అతను తడబడడంతో సంతోష్‌కుమార్ డౌట్ పడ్డాడు. మరింత ఆరాతీసేందుకు రవాణా శాఖ సర్వర్‌లో బండి వివరాలు తన ఐప్యాడ్‌లో చూడగా యజమాని హసీనా జబీన్ పేరు, ఫోన్ నంబరు తెరపై ప్రత్యక్షమయ్యాయి. వెంటనే ఆమెకు ఫోన్ చేయగా రెండు రోజుల క్రితం తన స్కూటీ బహదూర్‌పూర్‌లో చోరీకి గురయ్యిందని తెలపడంతో సంతోష్‌కుమార్ అప్రమత్తమయ్యారు.
స్టేషన్ పోలీసులను అలర్ట్‌చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని తరలించారు. అతన్ని విచారించగా తన పేరు శ్యామ్ అని, ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తుంటానని తెలపడంతో ఆశ్చర్యపోయారు. అతనిపై నాలుగు స్టేషన్లలో కేసులు ఉన్నాయని గుర్తించారు. కాగా, సంతోష్‌కుమార్ సమయస్ఫూర్తిని అధికారులు అభినందించి నిన్న జ్ఞాపిక అందజేశారు.