West Bengal: కళ్ల ముందే తండ్రి యాచిస్తుంటే తట్టుకోలేకపోయిన కుమార్తె : చనిపోయేందుకు సిద్ధం
- ఆకలి తీరే మార్గంలేక తల్లిదండ్రులు, కుమార్తె తీవ్ర నిర్ణయం
కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకోలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బర్సాత్‌లోని ఓ కుటుంబం దీన గాథ ఇది
ఎప్పుడు తిన్నారో వారికే తెలీదు. పట్టెడు మెతుకుల కోసం ముఖం వాచిపోయి ఉన్నారు. ఆకలి తట్టుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని ఓ పిల్లాడి వద్ద తండ్రి యాచిస్తుంటే కళ్లారా చూసిన కుమార్తె పరిస్థితి ఎలావుంటుంది?. తండ్రి చేసేది తప్పయినా తామున్న పరిస్థితుల్లో అంతకంటే వేరే మార్గంలేని అసహాయత వారిది. అందుకే దుర్భర స్థితి అనుభవిస్తూ ఎప్పుడో చనిపోవడం కంటే ముందే మూకుమ్మడిగా చనిపోవాలని వారంతా నిర్ణయించుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ అధికారులను కోరుతున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం బర్సాత్‌లోని ఓ కుటుంబం దీన గాథ ఇది.
వివరాల్లోకి వెళితే...గార్గీ బంద్యోపాధ్యాయ్‌ది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. ఆమె పీహెచ్‌డీ చేసింది. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంకో ఆదాయమార్గం కనిపించలేదు. మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేక కనీసం రోజుకోపూట కడుపునిండా తినే మార్గం కూడా కానరావడం లేదు. వృద్ధులైన తల్లిదండ్రుల మందులకు కూడా డబ్బుల్లేవు. ఆకలి తట్టుకోలేక తండ్రి యాచనకు కూడా సిద్ధం కావడం చూసి ఆమె కన్నీటి పర్యంతమయింది.
ఇంతటి దీన స్థితిలో ఈ భూమిమీద ఉండి ఏం చేయాలన్న నిర్ణయంతో కారుణ్య మరణానికి ముగ్గురూ దరఖాస్తు చేసుకున్నారు. తాము చనిపోయేందుకు అనుమతించాలంటూ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంటే ఆయన దాన్ని బర్సాత్ మున్సిపల్ చైర్మన్ సునీల్ ముఖర్జీకి పంపారు. అయితే నిబంధనల ప్రకారం గార్గీకి ఎటువంటి సాయం అందించలేమని, ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నిస్తామని సునీల్ తెలిపారు.