Telugudesam: ఎంపీ గల్లా జయదేవ్‌కు అవమానం.. ప్రొటోకాల్ పాటించని అధికారి
- ఎంపీ వెళ్లినా తలెత్తి చూడని అధికారి
- ప్రొటోకాల్ పాటించకుండా అవమానం
- మందలించిన ఎంపీ గల్లా జయదేవ్
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి గల్లా జయదేవ్ ఎన్నికై సత్తా చాటారు. ఎంపీ అయిన ఆయనకు స్థానిక అధికారులు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఆయనను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు.
ముఖ్యమైన సమావేశాలకు సైతం ఆయనను ఆహ్వానించడం లేదని అంటున్నారు. ఈ విషయంలో జయదేవ్ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల ఓ విషయమై అధికారితో మాట్లాడేందుకు జయదేవ్ వెళ్లారు. ఎంపీని చూసి కూడా ఆ అధికారి స్పందించలేదు. కనీస మర్యాద ఇవ్వకుండా సీట్లో కూర్చుని తన పని తాను చేసుకుంటున్నారు. గల్లా మాట్లాడుతున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం తలపైకెత్తి ఆయన వంక చూడకుండా అవమానించారు.
అధికారి తీరుతో మండిపడిన ఎంపీ గల్లా ఆయనను మందలించి వచ్చేశారు. ఎంపీకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా, ప్రొటోకాల్ పాటించకుండా ఆయన వ్యవహరించిన తీరుపై జయదేవ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇకనైనా పంథా మార్చుకోవాలని, ప్రొటోకాల్ పాటించాలని ఆ అధికారికి హితవు చెప్పి వచ్చేశారు.