kcr: ఇంకా ఎన్నేళ్లు పడుతుంది?... యాదాద్రి పనులు జరుగుతున్న తీరుపై కేసీఆర్ మండిపాటు
- యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
- ఆర్థిక సమస్యలు లేకపోయినా పనుల జాప్యంపై కేసీఆర్ ఫైర్
- పనులు పూర్తి చేయడానికి మరో ఐదేళ్లు కావాలా? అంటూ అసంతృప్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వందల కోట్లు వెచ్చించి యాదాద్రికి కొత్తరూపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, తాను ఆశించిన స్థాయిలో యాదాద్రి పుణ్యక్షేత్రంలో పనులు జరగడంలేదని కేసీఆర్ గుర్తించారు. ఆయన ఇవాళ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన "ఇంకా ఎన్నేళ్లు పడుతుంది?" అంటూ మండిపడ్డారు. "మరో ఐదేళ్లు కావాలా?" అంటూ ప్రశ్నించడంతో అధికారులు సమాధానం చెప్పేందుకు ఇబ్బందిపడ్డారు. ఆర్థిక సమస్యలు లేకపోయినా పనులు జరగకపోవడం పట్ల ఆయన అధికారులను హెచ్చరించినట్టు తెలిసింది. త్వరలోనే ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చించి నిధులు విడుదల చేయిస్తానని, శరవేగంతో పనులు జరగాలని స్పష్టం చేశారు. యాదాద్రి క్షేత్రం అభివృద్ధి కోసం రూ.473 కోట్ల మేర ప్రతిపాదనలు పంపామని అధికారులు చెప్పగా, తక్షణమే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. .