Kashmir: కశ్మీర్ వివాదం యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది: పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్
- ఎలాంటి చర్యనైనా తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉంది
- కశ్మీర్ అంశం సుదీర్ఘ కాలం కొనసాగే యుద్ధం
- కశ్మీర్ ప్రజల స్పందన కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది
కశ్మీర్ వివాదం యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఉందని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ అన్నారు. భారత్ ఎలాంటి సాహసానికి పూనుకున్నా తిప్పికొట్టేందుకు పాక్ ఆర్మీ సంసిద్ధంగా ఉందని చెప్పారు. కశ్మీర్ సమస్య ఇప్పట్లో తెగేది కాదని... ఇది సుదీర్ఘ కాలం కొనసాగే యుద్ధమని అన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కశ్మీర్ ప్రజలు ఎలా స్పందిస్తారో కొన్ని రోజుల్లో తెలుస్తుందని చెప్పారు. ఇండియన్ ఆర్మీ గుప్పిట్లో ఉన్న కశ్మీర్ లోకి ఇప్పుడు ఏ ఒక్కరూ ప్రవేశించే అవకాశం లేదని... ఎవరైనా ప్రవేశిస్తే భారత్ వైఫల్యం చెందినట్టేనని అన్నారు.
మరోవైపు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి మాట్లాడుతూ, పాకిస్థాన్ విదేశాంగశాఖ కార్యాలయంలో కశ్మీర్ కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ పాకిస్థాన్ ఎంబసీల్లో కశ్మీర్ డెస్క్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా కశ్మీర్ కు సంబంధించిన సమాచారం అందరికీ అందుతుందని చెప్పారు.