Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో గౌరవం.. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్’ లో నిర్మాణ వీడియో ప్రదర్శన!
- రూ.80 వేల కోట్ల అంచనాలతో నిర్మించిన ప్రభుత్వం
- ఇప్పటికే పూర్తయిన బ్యారేజీలు, పంపు హౌస్ లు
- ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ
తెలంగాణలోని 70 శాతం జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా తెలంగాణ నీటి అవసరాలను తీర్చేందుకు 150 టీఎంసీల వరకూ నీటిని ఎత్తిపోయవచ్చు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో గౌరవం దక్కింది. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వీడియోను అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు. ఈ ప్రఖ్యాత కూడలిలోని ఓ స్క్రీన్ పై కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, ఇతర ముఖ్యాంశాలను చూపారు. ఈ వీడియోను టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రూ.80,499 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.
2016లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తికాగా, ఇప్పుడు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది.ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు ఇప్పటికే పూర్తవగా, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు గానూ 8 మోటార్లు సిద్ధమయ్యాయి.