Telangana: మొన్న ఉత్తమ కానిస్టేబుల్‌గా పురస్కారం అందుకున్న చేతులకి.. నిన్న ఏసీబీ బేడీలు!
- స్వాతంత్ర్య దినోత్సవం నాడు మంత్రి చేతుల మీదుగా అవార్డు
- శుక్రవారం ట్రాక్టర్ యజమాని నుంచి రూ.17 వేల లంచం డిమాండ్
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ‘ఉత్తమ కానిస్టేబుల్’
ఉత్తమ కానిస్టేబుల్‌గా మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కానిస్టేబుల్ 24 గంటలు కూడా తిరక్కుండానే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం సంచలనమైంది. తెలంగాణలో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న తిరుపతి రెడ్డి ఉత్తమ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా తిరుపతిరెడ్డి పురస్కారం అందుకున్నాడు. గురువారం అందుకున్న పురస్కారాన్ని పక్కన పడేసిన కానిస్టేబుల్ శుక్రవారమే లంచాల దందాకు తెరతీశాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముడావత్ రమేశ్ అనే ఇసుక వ్యాపారిని అడ్డుకుని అతడి ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేశాడు. రూ.17 వేలు ఇస్తేనే ట్రాక్టర్‌ను విడిచిపెడతానని తేల్చి చెప్పాడు.
దీంతో బాధితుడు ముడావత్ రమేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం చెప్పాడు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను తరలిస్తున్నప్పటికీ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి తనను అడ్డుకుని లంచం డిమాండ్ చేస్తున్నాడని, ఇవ్వకుంటే తప్పుడు కేసులు బనాయిస్తానని హెచ్చరించాడంటూ రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
దీంతో ఏసీబీ అధికారులు అతడికి రూ.17 వేలు ఇచ్చి కానిస్టుబుల్‌కు ఇవ్వమని చెప్పారు. వారు చెప్పినట్టే పోలీస్ స్టేషన్ ఆవరణలో కానిస్టేబుల్‌ను కలిసి అడిగిన మొత్తం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు తిరుపతిరెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.