USA: అమెరికా చేరుకున్న జగన్.. ఘనస్వాగతం!
- యూఎస్ లో జగన్ వారం రోజుల పర్యటన
- ఈరోజు సాయంత్రం వాషింగ్టన్ డీసీ చేరుకున్న జగన్
- భారత రాయబార కార్యాలయ అధికారులు, ప్రవాసాంధ్రుల ఘనస్వాగతం
వారం రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం జగన్ నిన్న రాత్రి అమెరికా బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆయన వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. జగన్ కు ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అదే విధంగా భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా, నీల్ కాంత్ అవ్హద్ కూడా జగన్ కు ఆహ్వానం పలికారు.
సీఎంఓ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం జగన్ పర్యటన వివరాలు.. ఆగస్టు 16న అమెరికా రాయబారి, అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. అమెరికాలోని భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.
ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు డల్లాస్ కు చేరుకుని, అక్కడి 'కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్'లో సాయంత్రం 6 గంటలకు నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలిసి ప్రసంగిస్తారు.
ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారని, ఆగస్టు 19, 20, 21 తేదీల్లో జగన్ వ్యక్తిగత పనుల్లో ఉంటారని పేర్కొంది. ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను జగన్ కలుస్తారని, అదే రోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి భారత్ కు బయలుదేరతారని తెలిపింది.