ISIS: ఐసిస్ టెర్రరిస్టుకు చుక్కలు చూపించిన పక్షి.. తలలు పట్టుకున్న తోటి ఉగ్రవాదులు!
- యెమెన్ లోని ఓ ప్రాంతంలో ఘటన
- ఐసిస్ కు విధేయత ప్రకటించిన అబూ ముహమ్మద్
- వీడియోను లీక్ చేసిన తోటి ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా
ఉగ్రవాదులంటే కనికరం లేకుండా ఎవరినైనా చంపేస్తారని మనం భావిస్తాం. వాళ్లకు దయాదాక్షిణ్యాలు ఉండవనుకుంటాం. కానీ తాజాగా విడుదలైన ఓ వీడియోలో మాత్రం ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రవాది కమెడియన్ కంటే దారుణంగా తయారయ్యాడు. యెమెన్ లో ప్రస్తుతం ఉగ్రసంస్థలు అల్ కాయిదా, ఐసిస్ పోటాపోటీగా కార్యకలాపాలు నడుపుతున్నాయి. ఈ క్రమంలో అబూ ముహహ్మద్ అల్ అదెనీ అనే కుర్ర టెర్రరిస్టు ఐసిస్ లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఐసిస్ కు విధేయత ప్రకటిస్తూ వీడియో తీయడం మొదలుపెట్టాడు.
అయితే ఎక్కడినుంచో ఓ పక్షి అక్కడకు చేరుకుంది. అబూ ముహమ్మద్ ఎంత గట్టిగా మాట్లాడితే, ఆ పక్షి కూడా అంతే గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాని శబ్దంతో బాగా డిస్టర్బ్ అయిన ఈ టెర్రరిస్టు.. తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా మర్చిపోయాడు. దీంతో జేబులోని పేపర్ బయటకు తీసి తన ప్రతిజ్ఞను చదవడం ప్రారంభించాడు. దీంతో ఈ వీడియో తీస్తున్న తోటి ఉగ్రవాదులు తలలు పట్టుకున్నారు. ప్రశాంతంగా ఉంటూ విధేయత ప్రకటించాలని సూచించారు.
ఇదంతా ఓ ఎత్తయితే ..ఈ వీడియోను తోటి ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా లీక్ చేయడం గమనార్హం. అక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మద్యప్రాచ్య దేశాల నిపుణుడు డా.కెండల్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ వీడియోను 2017లో చిత్రీకరించారనీ, అయితే ఐసిస్ పరువు తీయడానికి వారం రోజుల క్రితం అల్ కాయిదా ఈ వీడియోను గుర్తించి లీక్ చేసిందని చెప్పారు.