Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ పై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి రహస్య సమావేశం.. భారత్, పాక్ లకు నో ఎంట్రీ
- రేపు రాత్రి భద్రతామండలి రహస్య సమావేశం
- చైనా కోరిక మేరకు సమావేశాన్ని నిర్వహించనున్న భద్రతామండలి
- హాజరుకానున్న సభ్యదేశాలు
కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి రహస్య సమావేశాన్ని నిర్వహించనుంది. రేపు రాత్రి 7.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పాకిస్థాన్ రాసిన లేఖ నేపథ్యంలో, సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా చైనా కోరడంతో... ఈ రహస్య భేటీని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి భద్రతామండలి సభ్యదేశాలు హాజరుకానున్నాయి. అయితే, భారత్, పాక్ లకు సమావేశంలో పాల్గొనే అవకాశం లేదు. అంతేకాదు, ఈ సమావేశంలో చర్చించే అంశాలు కూడా రహస్యంగానే ఉండబోతున్నాయి. ఈ సమావేశాలను బ్రాడ్ కాస్ట్ చేయడం ఉండదు. అంతేకాదు, సమావేశంలో ఏం చర్చించారనే వివరాలు కూడా పబ్లిక్ కు అందుబాటులో ఉండవు.
ఇప్పటికే భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో చైనా మినహా అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్ లు భారత్ కు అనుకూలంగా వ్యాఖ్యానించాయి. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని అమెరికా స్పష్టం చేసింది.