India: ఐదుగురు భారత జవాన్లను చంపేశామన్న పాక్ సైన్యం... అబద్ధమన్న ఇండియన్ ఆర్మీ!
- ఎల్ఓసీ వద్ద ఫైరింగ్ ను పెంచిన భారత్
- ప్రతి కాల్పుల్లో ఐదుగురు మరణించారన్న పాక్
- అంతా అబద్ధమేనని స్పష్టం చేసిన కల్నల్ అమన్ ఆనంద్
తాము ఐదుగురు భారత జవాన్లను వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఫైరింగ్ లో కాల్చామని, వారంతా చనిపోయారని పాక్ సైన్యం చేసిన ప్రకటనను భారత ఆర్మీ అధికారులు ఖండించారు. పాకిస్థాన్ అబద్ధాలు చెబుతోందని ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ వెల్లడించారు. పాకిస్థాన్ మిలిటరీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేస్తూ, ఎల్ఓసీ వద్ద భారత్ ఫైరింగ్ ను పెంచిందని, పాక్ సైన్యం ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇండియా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఇరు దేశాల మధ్యా భారీగా ఫైరింగ్ జరిగిందని, భారత్ వైపున్న ఎన్నో బంకర్లను తమ సైన్యం నాశనం చేసిందని అన్నారు. కాగా, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత, సరిహద్దుల్లో ఇరు దేశాలూ సైనిక పహారాను భారీగా పెంచిన సంగతి తెలిసిందే.