Jagan: జగన్ గారు సీఎం అయ్యారని వరుణుడు పక్క రాష్ట్రాలకు పారిపోయాడా?... వైసీపీ మేధావులు మాత్రమే చెప్పాలి: నారా లోకేశ్
- జగన్ ను వైసీపీ నేతలు భగీరథుడితో పోల్చుతున్నారంటూ లోకేశ్ ట్వీట్
- రాష్ట్రంలో ఇంకా 10 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైందన్న టీడీపీ యువనేత
- వరుణుడు ఏమయ్యాడు? అంటూ ప్రశ్నాస్త్రం
తమ వల్లే వర్షాలు వస్తున్నాయని, వరదలు వస్తున్నాయని వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3 జిల్లాలలోనే సాధారణ వర్షపాతం నమోదైందన్న విషయం గుర్తెరగాలని లోకేశ్ హితవు పలికారు. ఇంకా 10 రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే నమోదైందని, ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని ట్వీట్ చేశారు.
ఓవైపు సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోందని, చినుకు లేక రాయలసీమ రాళ్లసీమలా మారిపోయిందని, ప్రకాశం జిల్లా ప్రజలు గుక్కెడు తాగునీటికి అలమటించిపోతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి రాష్ట్రంలో ఇంతటి కష్టం నెలకొన్న నేపథ్యంలో, తమ జగనన్న భగీరథుడు అని వైసీపీ నేతలు చెప్పుకోవడం భావ్యమేనా? అని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయ్యాడని వరుణుడు పక్క రాష్ట్రాలకు పారిపోయాడా? మరి వరుణుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నలకు వైసీపీ మేధావులు మాత్రమే సమాధానం ఇవ్వాలంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.