Tamilnadu: వెల్లూరును మూడు జిల్లాలుగా చేస్తున్నాం.. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటన!
- రాణిపేట్, తిరుప్పత్తూరు, వెల్లూరు అని నామకరణం
- ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం
- చెన్నైలో మీడియాతో తమిళనాడు సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న వెల్లూరు జిల్లాను మూడు ముక్కలు చేయాలని నిర్ణయించుకున్నారు. వెల్లూరు జిల్లాను రాణిపేట్, తిరుప్పత్తూరు, వెల్లూరు అని మూడు జిల్లాలుగా విభజిస్తామని సీఎం పళనిస్వామి తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 37కు చేరుకుంటుందని అన్నారు. చెన్నైలో ఈ రోజు ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రాంతంలోని ప్రజల డిమాండ్ మేరకే తాము మూడు జిల్లాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే రాష్ట్రం అవతరించిన నవంబర్ 1ని తమిళనాడు దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఇస్తున్న పెన్షన్ ను రూ.15 వేల నుంచి రూ.16,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర్య సమరయోధుల చట్టబద్ధమైన వారసులకు పెన్షన్ ను రూ.7,500 నుంచి రూ.8,000కు పెంచుతున్నామని తెలిపారు.