Andhra Pradesh: ఈ మేనిఫెస్టో గ్రామ వాలంటీర్ల బుర్రలో రిజిస్టర్ అయిపోవాలి!: సీఎం జగన్
- గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి
- అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్ష
- యువతీయువకులే వ్యవస్థలో మార్పు తీసుకురాగలరని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించేందుకు ఉద్దేశించిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడ ఎస్.ఎస్.కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కులాలు, మతాలు, పార్టీలు అని చూడకుండా అందరికీ మంచి జరగాలి.
మనకు ఓటు వేయనివారు కూడా మనం చేసే మంచిని చూసి వారి మనసు కరగాలి. మళ్లీ ఎన్నికల్లో మనకు ఓటేయాలి. గ్రామ వాలంటీర్ గా వస్తున్నవాళ్లంతా యువతీయువకులే. వీళ్లంతా గ్రామంలో మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉన్న వ్యక్తులే. ఇటువంటి యంగ్ స్టర్లే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాగలరు. అందుకే గ్రామ వాలంటీర్ అనే పదం తీసుకొచ్చాం’ అని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే, 3 నెలల్లోపే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బహుశా ఎక్కడా లేదని సీఎం జగన్ తెలిపారు. ‘ప్రతీ 2000 జనాభాకు ఓ గ్రామ సెక్రటేరియట్ పెడుతున్నాం. అందులో 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ గ్రామ సెక్రటేరియట్ పూర్తిగా ఉపయోగపడాలంటే ప్రతీ 50 ఇళ్లకు ఒకరు బాధ్యత తీసుకోవాలి. నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న భావన వారికి కల్పించాలి.
నా దగ్గర నుంచి మొదలైన ఈ స్వరం మీదాకా పోవాలి. ఇక గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఒకటి లబ్ధిదారులను గుర్తించడం. మేనిఫెస్టోలో మనం చెప్పిన ప్రతీ పథకం అమలవుతుంది. మేనిఫెస్టోను మేం ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తున్నాం. ఇందులోని ప్రతీ అంశం గ్రామ వాలంటీర్ల బుర్రలో రిజిస్టర్ కావాలి. ఈ హామీలన్నీ మీ ద్వారానే అమలవుతాయి‘ అని సీఎం జగన్ చెప్పారు.