Andhra Pradesh: ప్రస్తుతం ఏపీలో సిమెంట్ బస్తా కన్నా ఇసుక బస్తా ధర అధికంగా ఉంది!: టీడీపీ నేత ఆలపాటి రాజా
- 73 రోజుల్లో జగన్ ఏం చేశారో చెప్పాలి
- జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి కుంటుపడింది
- గుంటూరులో మీడియాతో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత ఆలపాటి రాజా తీవ్రంగా మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ తో సమాజానికి వచ్చే నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. గత 73 రోజుల పదవీకాలంలో జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గుంటూరు జిల్లాలో ఈరోజు అలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. జగన్ అసమర్థ వైఖరి కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించిన ఘనత జగన్ దేనని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఏపీలో సిమెంట్ బస్తా కన్నా ఇసుక బస్తా ధర అధికంగా ఉందని ఆలపాటి రాజా విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండగా, ఇప్పుడు విద్యుత్ కోతలు నెలకొన్నాయని దుయ్యబట్టారు. జగన్ పాలన కారణంగా ఏపీ అంతర్జాతీయ స్థాయిలో తలదించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకురాబోతున్న గ్రామ వాలంటీర్ వ్యవస్థ కారణంగా అవినీతి రాజ్యమేలుతుందని రాజా హెచ్చరించారు. జగన్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.