Tamil Nadu: కొబ్బరికాయలు తలపై కొట్టించుకుంటారు: తమిళనాడులో అమ్మవారికి వింత మొక్కు!
- గాయపడతామని తెలిసినా వెరవని కురుంబా గిరిజనులు
- ఈ ఏడాది ఉత్సవంలో 20 మందికి గాయాలు
- గాయాలకు చికిత్స చేయించుకునేందుకు అంగీకరించని భక్తులు
నమ్మకం అనండి...మూఢనమ్మకం అనండి... ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం వెలుగొందుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ వాసుల్లో అమ్మవార్ల పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు ఉంటాయి. అమ్మవార్లకు మొక్కు తీర్చుకునేందుకు వారు ఎంతటి సాహసమైనా చేస్తారు. ఉదాహరణకు తలపై కొబ్బరికాయ కొడితే ఏం జరుగుతుందో తెలుసుగా? కొబ్బరికాయ పగిలినా పగలకపోయినా.. తలకాయ మాత్రం పగులుతుంది.
ఇది తెలిసినా తమిళనాడు రాష్ట్రం కులితలాయ్ సమీపంలోని మెట్టు మహాదానపురంలోని కురుంబా గిరిజనులు ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. తమ ఇష్టదేవత మహాలక్ష్మి అమ్మవారి మొక్కుతీర్చుకునేందుకు తలపై కొబ్బరికాయలు కొట్టించుకుంటారు. నిన్న జరిగిన ఉత్సవంలో పలువురు భక్తులు ఇదే విధంగా మొక్కుతీర్చుకున్నారు. భక్తుల తలపై పూజారి కొబ్బరికాయలు కొట్టారు. 20 మంది భక్తులు ఈ సందర్భంగా గాయపడ్డారు. వీరికి చికిత్స అందించేందుకు అధికారులు అంబులెన్స్‌లు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినా చికిత్సకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. రక్తం ఓడుతున్న గాయాలపై విభూది, పసుపు రాసుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి వెళ్లిపోయారు.