Narendra Modi: లగ్జరీని కోరుకుంటున్న భారతీయులు... మారకుంటే సాధ్యం కాదని మెత్తగా మొత్తిన మోదీ!
- పన్ను పరిధిలోని వారంతా మారాలి
- అప్పుడే దేశాభివృద్ధి సులువవుతుంది
- ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించం
- ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మోదీ
నవీన భారతావనిలో ప్రజలు మరింత సౌకర్యాన్ని, సుఖాన్ని కోరుకుంటున్నారని, కావాల్సిన లగ్జరీ దొరకాలంటే, ప్రజల్లో మార్పు రావాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, నేటి తరం ప్రజలు మరిన్ని విమానాశ్రయాలను, రైల్వే స్టేషన్లలోనూ 5 స్టార్ సదుపాయాలు కావాలని కోరుతున్నారని, ఏసీ బస్సుల్లో ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారని గుర్తు చేసిన మోదీ, పన్ను చెల్లింపుల నుంచి, డిజిటల్ చెల్లింపుల వరకూ ప్రతి ఒక్కరూ ఆధునిక ప్రపంచంవైపు అడుగులు వేయాలని సూచించారు. అప్పుడే కోరుకున్న సౌకర్యాలు దగ్గరవుతాయని మెత్తగా మొత్తారు.
ఇప్పటికీ తాము చెల్లించాల్సిన పన్నులను కోట్లాది మంది చెల్లించడం లేదని, అటువంటప్పుడు సౌకర్యాలు ఎలా దగ్గరవుతాయని ప్రశ్నించారు. వేగంగా దూసుకెళ్లగల వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని వాడాలంటే, విశాలమైన రహదారులు ఉండాలని, అవి రావాలంటే ప్రజల సహకారం తప్పనిసరని అన్నారు. ఆదాయపు పన్ను పరిమితిని దాటి ఆదాయం పొందుతున్న వారంతా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించి జాతి అభివృద్ధికి సహకరించాలన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను సాధించడం, ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ ను ఒడిసి పట్టుకున్న భారత్ కు పెద్ద సమస్యేమీ కాదని అన్నారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించిన నరేంద్ర మోదీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్ రాష్ట్రాల్లో శాంతి స్థాపనే తమ ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఎర్రకోటపై రెపరెపలాడే మువ్వన్నెల జెండా శ్రీనగర్ లాల్ చౌక్ సహా దేశ నలుచెరగులా ఎగరాలని పిలుపునిచ్చారు.