Krishna River: తుంగభద్ర డ్యామ్... 18 గేట్ల మూసివేత!
- కర్ణాటకలో తగ్గిన వర్షాలు
- తుంగభద్రకు తగ్గిన వరద
- 15 గేట్లు మాత్రమే ఓపెన్
కర్ణాటకను గడచిన రెండు వారాలుగా వణికించిన వరుణుడు శాంతించడంతో, వరదలు తగ్గుముఖం పట్టాయి. తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గింది. నిన్నటి నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండటంతో, జలాశయానికి ఉన్న 33 క్రస్ట్ గేట్లలో 18 గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 15 గేట్లను మాత్రమే తెరచివుంచగా, శ్రీశైలం జలాశయానికి 67,555 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.
ఇదే సమయంలో తుంగభద్ర జలాశయానికి ఎగువన ఉన్న తుంగ, సింగటలూరు జలాశయాల నుంచి 71,677 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. వరద తగ్గుముఖం పట్టడంతోనే 18 గేట్లను దించామని అధికారులు వెల్లడించారు. తుంగభద్ర రిజర్వాయర్ నీటి సామర్థ్యం 100.860 టీఎంసీలు కాగా, 100 టీఎంసీలను నిల్వ ఉంచుతున్నామన్నారు. జలాశయం నుంచి కాలువల ద్వారా రోజుకు 3,720 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని బోర్డు సెక్రెటరీ నాగమోహన్ తెలిపారు.