India: అసోం, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా కశ్మీర్ గతే పడుతుంది!: ఒవైసీ వార్నింగ్

  • నాగాలాండ్ కు వెళ్లాలంటే నేను పర్మిట్ తీసుకోవాలి
  • అసోంలో నేను భూమిని కొనలేను
  • నాగాలాండ్ లో ఇంకా రెండు జెండాలు ఉన్నాయి

జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి, అక్కడి పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి స్పందించారు. తాను లోక్ సభ సభ్యుడిని అయినా నాగాలాండ్, లక్షద్వీప్ కు వెళ్లాల్సి వస్తే పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అసోం లాంటి షెడ్యూల్డ్ ప్రాంతంలో తాను భూమిని కూడా కొనలేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం భారత ప్రభుత్వం నాగాలాండ్ వేర్పాటువాదులతో చర్చలు జరుపుతున్న విషయాన్ని ఒవైసీ గుర్తుచేశారు. కానీ నాగా వేర్పాటువాదులు ఇంకా ఆయుధాలు వదిలిపెట్టలేదని చెప్పారు. ఇప్పటికీ నాగాలాండ్ లో స్థానిక నేతలు చనిపోతే భారత జెండాతో పాటు నాగా జెండా కూడా ఎగురుతుందని తెలిపారు. జమ్మూకశ్మీర్ లో రెండు జెండాల గురించి మాట్లాడుతున్నవారికి నాగాలు రెండు జెండాలు ఎగరేయడం కనిపించలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎవరిని మూర్ఖులుగా చేయాలనుకుంటుందని నిలదీశారు. ఈరోజు జమ్మూకశ్మీర్ కు పట్టినగతే రేపు నాగాలాండ్, మిజోరం, మణిపూర్, అసోం, హిమాచల్ ప్రాంత ప్రజలకు పడుతుందని హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News