Chandrababu: వరద భయంతో ఇల్లొదిలేసి పారిపోయిన చంద్రబాబు: మంత్రి కన్నబాబు ఎద్దేవా
- లింగమనేని గెస్ట్ హౌస్ లోకి వరద
- ఇసుక మేటలు కనిపిస్తున్నాయి
- ముందే చెబితే బాబు వినిపించుకోలేదన్న ఏపీ మంత్రులు
ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద ఉద్ధృతి పెరగడంతో చంద్రబాబు, తన నివాసాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ కు పారిపోయారని ఏపీ మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ ఉదయం కృష్ణానదీ కరకట్టపై వరద పరిస్థితిని పరిశీలించిన వారు, అనంతరం మీడియాతో మాట్లాడారు. నాగాయలంక, కంచికచర్ల, భవానీపురం తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు వెల్లడించారు.
నది ఒడ్డునే ఉన్న చంద్రబాబు ఇంట్లోకి నీరు చేరి, ఇసుక మేటలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇంటిని ఖాళీ చేయాలని తాము చెబితే, రాజకీయ కోణంలో చూసి విమర్శించిన ఆయనకు, ఇప్పుడు వరద వస్తే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో అర్ధమైందని అన్నారు. తాము మంచికి చెప్పినా బాబు వినిపించుకోలేదని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబు నివాసం ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ తొలి అంతస్తులోని సామాగ్రి, ఫర్నీచర్ ను రెండో అంతస్తులోకి తరలించినట్టు తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ లో మరో రెండడుగుల మేరకు నీరు చేరితే, బాబు నివాసంతో పాటు, దానికి అవతల ఉన్న ప్రజా వేదిక, దాన్ని ఆనుకుని ఉన్న రహదారిపై వరకూ నీరు వస్తుందని అంచనా.