flight travel: విమానంలో ఒకే ఒక్కడు...బరువు చాలక ఇసుక బస్తాలు వేసిన సిబ్బంది!
- టికెట్ బుక్ చేసుకున్నది అతనొక్కడే
- డెల్టా విమానంలో ప్రయాణించిన రచయిత విన్సెంట్
- కొలరాడో నుంచి సాల్ట్‌లేక్‌కు జర్నీ
విమాన ప్రయాణం ఓ ప్రత్యేక అనుభూతినిస్తుంది. అదీ ఒక్కడే ప్రయాణిస్తే మరో మధురానుభూతి. కాకపోతే ఆ ఒక్కడి బరువుతో విమాన ప్రయాణం సాధ్యం కానందున సిబ్బంది అదనపు ప్రయాణికుల స్థానంలో కొన్ని ఇసుక బస్తాలువేసి ప్రయాణాన్ని కొనసాగించడం విశేషం. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి.
ప్రముఖ రచయిత, దర్శకుడు విన్సెంట్ పియోన్ కొలరాడోలోని ఆస్సెన్ నుంచి సాల్ట్ లేక్ సిటీకి వెళ్లేందుకు డెల్టా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా విమానాశ్రయానికి వెళ్లాక బోర్డింగ్ వద్ద తానొక్కడినే ప్రయాణికుడినని తెలియడంతో ఆశ్చర్యపోయాడు. ఇదో సరికొత్త అనుభూతిగా భావించిన పియోన్ తన ప్రయాణాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో ఉంచాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘నేనొక్కడినే ప్రయాణికుడిని కావడంతో కార్గో సిబ్బంది బరువు కోసం ఇసుక బస్తాలు వేయడం గమనించాను. ఒక్కడినే ప్రయాణికుడిని అయినా సిబ్బంది ఎప్పటిలాగే తమ మర్యాదలు పాటించారు. ఎప్పుడైనా ఇటువంటిది జరిగిందా అని వారిని ప్రశ్నించగా అప్పుడప్పుడూ జరుగుతుంటాయని తెలిపారు’ అని పియోన్ వివరించాడు.