Telangana: కేసీఆర్.. మేము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా?: సీపీఐ నేత రామకృష్ణ

  • ‘ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాకేమీ తెలియదా?
  • నాడు రాయలసీమకు చుక్కనీళ్లు ఇవ్వకూడదన్నావు
  • ఇప్పుడేమో సీమను సస్యశ్యామలం చేస్తానంటున్నావు!

రాయలసీమను సస్య శ్యామలం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నారని, ఆయన మాటలు నమ్మడానికి ‘మేము ఏమన్నా చెవిలో పువ్వులు పెట్టుకున్నామా?’ ‘ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాకేమీ తెలియదా?’ ‘నీ ఒక్కడికే తెలుసా?’ అంటూ సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఇంతకుముందు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు ఏమన్నావు? నీళ్ల దొంగలు అన్నావు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మూసేస్తామన్నావు.

అసలు, రాయలసీమకు చుక్కనీళ్లు తీసుకుపోకూడదని చెప్పావు. ఇప్పుడు అదే నాలుకతో మళ్లీ రాయలసీమను నేనే సస్యశ్యామలం చేస్తాను అని చెబుతావు! నిజంగా, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు రాయలసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏవైతే అఫిడవిట్లు దాఖలు చేశారో, వాటిని ఉపసంహరించుకో. అప్పుడు, మాట్లాడు నువ్వు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత అధ్వానంగా మాట్లాడటం సరైంది కాదు. నువ్వు చేస్తున్నది ఏంటి? చెబుతున్నది ఏంటి?’ అని మండిపడ్డారు.

రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని జగన్ తమ ముఖ్యమంత్రి కనుక చెబుతారని, ‘నీవు ఎవరయ్యా? నువ్వు చేస్తావా? వ్యతిరేకంగా పని చేస్తూ రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెబుతావు? అంటూ కేసీఆర్ పై రామకృష్ణ ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News