Chandrababu: చంద్రబాబు చేతికి కట్టు... కారణం ఏమిటంటే..!
- చంద్రబాబు కుడి చేతికి స్వల్ప గాయం
- చేతికి కట్టుతోనే పార్టీ సమావేశానికి హాజరైన వైనం
- నరంపై ఒత్తిడి పెరగడంతో డాక్టర్లు కట్టు కట్టినట్టు సమాచారం
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఈ నేపథ్యంలో, విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి చేతికి కట్టుతోనే ఆయన హాజరయ్యారు. చేతి కట్టుతోనే ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. చేతి నరంపై ఒత్తిడి పెరగడంతో వైద్యులు ఆయనకు కట్టుకట్టినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 150 మంది సభ్యులు ఉన్నామంటూ అధికార పార్టీ అసెంబ్లీలో బెదిరిస్తోందని మండిపడ్డారు. తాము లేస్తే ఏ ఒక్కరూ మిగలరని హెచ్చరించారు. సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వడం లేదని చెప్పారు. గ్రామ వాలంటీర్ల పేర్లతో ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఇసుకపై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ... ఇప్పుడు ఇసుక కొరతను సృష్టించి, ఇసుక ధరను విపరీతంగా పెంచేసిందని అన్నారు. సిమెంట్ కన్నా ఇసుక ధరే ఎక్కువైందని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి ప్రాభవం కోల్పోయిందని చెప్పారు.