BJP: బీజేపీ విషయంలో ఒకరిపై ఒకరు అరుచుకున్న కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్, మెహబూబా
- బీజేపీని రాష్ట్రంలోకి తీసుకొచ్చింది నువ్వేనంటే నువ్వే అంటూ వాగ్వివాదం
- కశ్మీర్‌ను భారత్‌లో కలిపి షేక్ అబ్దుల్లా తప్పు చేశారన్న మెహబూబా
- గొడవతో వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లిన అధికారులు
జమ్ము,కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి నువ్వంటే నువ్వే కారణమంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సందర్భంలో మెహబూబాపై ఒమర్ గట్టిగా అరుస్తూ విరుచుకుపడినట్టు తెలుస్తోంది. జమ్ము,కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు ఒమర్, మెహబూబా సహా పలువురు నేతలను ప్రభుత్వం గృహ నిర్బంధంలోకి తీసుకుంది.
శ్రీనగర్‌లోని హరి నివాస్‌లోని కింది అంతస్తులో ఒమర్‌ను ఉంచితే, మొదటి అంతస్తులో మెహబూబాను ఉంచారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. రాష్ట్రంలోకి బీజేపీ రావడానికి నువ్వంటే, నువ్వే కారణమని పరస్పరం ఆరోపించుకున్నారు. ఒకానొక దశలో ఒమర్ పెద్దగా అరుస్తూ 2015, 2018లో పొత్తు పెట్టుకోవడం వల్లే ఇదంతా జరిగిందంటూ ముఫ్తీని, ఆమె తండ్రి మహ్మద్ సయీద్‌ను తీవ్రంగా తప్పుబట్టారు.
ఒమర్‌కు మెహబూబా బదులిస్తూ వాజ్‌పేయి హయాంలో మీ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని ఆరోపించారు. అంతేకాదు, వాజ్‌పేయి హయాంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన విషయాన్ని మర్చిపోయావా? అంటూ ఒమర్‌ను ప్రశ్నించారు. 1947లో జమ్ము,కశ్మీర్‌ను భారత్‌లో కలిపి పెద్ద తప్పు చేశారంటూ ఒమర్ తాత షేక్ అబ్దుల్లాపైనా మెహబూబా విరుచుకుపడ్డారు. వీరి మధ్య వాగ్వివాదంతో అప్రమత్తమైన అధికారులు వీరిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచినట్టు ప్రొటోకాల్ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు.