Delhi: విద్యుత్ చౌర్యం కేసులో నిందితుడికి వింత శిక్ష విధించిన ఢిల్లీ హైకోర్టు
- 50 మొక్కలు నాటాలంటూ న్యాయమూర్తి ఆదేశం
- ఒక్కో మొక్క ఆరడుగుల ఎత్తు ఉండాలంటూ షరతులు
- మొక్కలు నాటే విధానాన్ని ఫొటోలు తీసి తమకు సమర్పించాలంటూ స్పష్టీకరణ
ఢిల్లీలో ఓ దుకాణదారు విద్యుత్ స్తంభం నుంచి నేరుగా వైర్లు లాగి విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. అతడిపై విద్యుత్ శాఖ వర్గాలు జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. దాంతో ఆ షాపు యజమాని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. విద్యుత్ చౌర్యానికి పాల్పడింది తాను కాదని, తన దుకాణాన్ని మరో వ్యక్తికి అద్దెకు ఇస్తే అతడు విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడని వివరించాడు. అయితే, న్యాయమూర్తి అతడి వాదనలను పక్కనబెట్టి, నీపై క్రిమినల్ విచారణ నిలిపివేయాలంటే 30 రోజుల్లో 50 మొక్కలు నాటాలంటూ కొత్త తరహాలో శిక్ష విధించారు. ఈ క్రమంలో అతడికి దిశానిర్దేశం కూడా చేశారు.
ఢిల్లీ మహానగరంలోని వందేమాతరం మార్గ్, సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్, బుద్ధ జయంతి ఉద్యానవనం వద్ద మొక్కలు నాటాలని తెలిపారు. అంతేకాదు, ఆ మొక్కలు 6 అడుగుల ఎత్తు ఉండాలని, వాటి వయసు 2 నుంచి 3 ఏళ్లు ఉండాలని, ఢిల్లీ నేలకు, వాతావరణానికి అనుకూలంగా ఉండే మొక్కలనే ఎంచుకోవాలని షరతులు విధించారు. న్యాయస్థానం అంతటితో ఆగకుండా, మొక్కలు నాటే విధానాన్ని ఫొటోలు తీసి తమకు సమర్పించాలంటూ నిందితుడికి స్పష్టం చేసింది.