Andhra Pradesh: వైఎస్ జగన్ పాదయాత్రపై పుస్తకం ‘జయహో’ ఆవిష్కరణ
- తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం
- ప్రజల సహకారంతోనే పాదయాత్ర చేయగలిగా
- ‘జయహో’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ గతంలో ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరిట చేపట్టిన పాదయాత్రపై సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి ఓ పుస్తకాన్ని సంకలనం చేశారు. ‘జయహో’ పేరుతో వెలువడిన ఈ పుస్తకాన్ని జగన్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, ‘ది ప్రింట్’ ఎడిటర్ -ఇన్- చీఫ్ శేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే 3648 కిలోమీటర్ల పాదయాత్రను చేయగలిగానని అన్నారు. పద్నాలుగు నెలల పాటు సాగిన తన పాదయాత్రలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు తమ పార్టీకి వచ్చాయని గుర్తు చేశారు.
దేవుడు ఆశీర్వదిస్తే జగన్ కు అధికారం రావాలని ప్రజలు కోరుకున్నారని, తనకు అధికారం వస్తే సమస్యలు తీరతాయని వారు నమ్మారని, ఆ నమ్మకమే తమ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిందని అన్నారు. అంతటి విశ్వాసం, నమ్మకం పాదయాత్ర వల్లే వచ్చిందని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పారు.