Venkaiah Naidu: జాతి ప్రయోజనాల కోసమే ఆర్టికల్ 370 రద్దు: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ఇది రాజకీయపరమైన అంశంkకాదు
- కశ్మీర్ ప్రజల వెనుక దేశ ప్రజలంతా ఉంటారు
- చరిత్రను విశ్లేషించుకుని ముందడుగు వేయాలి
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమర్థించారు. జాతి ప్రయోజనాల కోసమే ఆ ఆర్టికల్ ను రద్దు చేశారని, ఇది రాజకీయపరమైన అంశం కాదని చెప్పారు. కశ్మీర్ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా యావత్ దేశ ప్రజలు వారి వెనుకే ఉంటారని చెప్పారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తగిన చర్యలను చేపట్టాలని అన్నారు.
'చరిత్రను మనందరం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏం జరిగింది, ఏం జరగలేదు అనే అంశాలను విశ్లేషించుకుని ముందడుగు వేయాలి. జాతి ప్రయోజనాలు, భవిష్యత్తు, భద్రత కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశారు' అని వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్యనాయుడు రచించిన 'లిజనింగ్... లెర్నింగ్... లీడింగ్' పుస్తకాన్ని నిన్న చెన్నైలో ఆవిష్కరించారు. ఉప రాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానాన్ని వెంకయ్యనాయుడు పుస్తక రూపంలో తీసుకువచ్చారు.
చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంతి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.