reliance: రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది.. మాకు 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు!: ముఖేశ్ అంబానీ
- రిలయన్స్ రిటైల్ ద్వారా రూ.1.30 లక్షల కోట్లు ఆర్జించాం
- 107 దేశాలకు పెట్రో ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నాం
- సౌదీ కంపెనీ అరామ్ కోతో కీలక ఒప్పందం చేసుకున్నాం
- రిలయన్స్ 42వ ఏజీఎం సదస్సులో గ్రూప్ చైర్మన్ ముఖేశ్ అంబానీ వెల్లడి
‘న్యూ ఇండియా-న్యూ రిలయన్స్’ నినాదంతో తాము ముందుకు పోతున్నామని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. ముంబైలోని బిర్లా మాతుశ్రీ సభానగర్ లో ఈరోజు రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
వినియోగదారులకు ప్రత్యక్షంగా సేవలు అందించే ‘కన్జ్యూమర్ బిజినెస్’లో రిలయన్స్ విజయం సాధించలేదని చాలామంది గతంలో అన్నారని, కానీ అలాంటి అన్ని విమర్శలను రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ లతో వాటిని తిప్పికొట్టామని ముఖేశ్ వ్యాఖ్యానించారు. ఈ రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్ లో ప్రత్యేకంగా లిస్ట్ అయ్యాయనీ, మార్కెట్ విలువపరంగా ఈ రెండు కంపెనీలు దేశంలో టాప్-10 స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం జియోకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని ముఖేశ్ అంబానీ తెలిపారు. టెలికాం రంగంలో ఆదాయం, కస్టమర్ల పరంగా తమ కంపెనీ నంబర్ 1గా నిలిచిందని చెప్పారు. ఇక రిలయన్స్ రిటైల్ రూ.1,30,000 కోట్లతో భారత్ లోనే అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించిందని వెల్లడించారు. ఈ రెండు కంపెనీలు తమ గ్రూప్ నకు 32 శాతం ఆదాయాన్ని తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక పెట్రోలియం రంగంలో రూ.2,24,391 కోట్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను 107 దేశాలకు ఎగుమతి చేశామని ముఖేశ్ అంబానీ చెప్పారు. ఇది మొత్తం భారత ఎగుమతుల విలువలో 9.8 శాతమని చెప్పారు. ఇందుకోసం రూ.26,379 కోట్లను ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నుల రూపంలో చెల్లించామన్నారు. ఇక రిలయన్స్ ఆయిల్ కెమికల్ బిజినెస్ లో 20 శాతం వాటాను సౌదీ అరేబియా ఆయిల్ దిగ్గజం ‘అరామ్ కో’ 5.32 లక్షల కోట్లకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు.