Kerala: అమ్మకానికి తెచ్చిన దుస్తులను వరద బాధితులకు ఇచ్చేసిన వ్యాపారి!
- ఎర్నాకులంలోని ఓ వ్యాపారి త్యాగం ఇది
- ఈద్ మార్కెట్ కోసం కొత్త స్టాక్ తెప్పించిన నౌషద్
- బాధితుల కడగండ్లు చూడలేక వితరణ
ఇస్లాంను పాటించే ప్రతి ముస్లిం తన సంపాదనలో ఎంతో కొంత నిరుపేదలకు దానం చేయాలని ఖురాన్ సూచిస్తోంది. పైగా త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ వేళల్లో ఆపద వచ్చిపడింది. అభాగ్యులను ఆదుకోవడం కంటే మించినది ఏముంటుందని భావించిన ఆ వ్యాపారి ఈద్ కోసం తెచ్చిన దుస్తుల కొత్త స్టాక్ మొత్తం వరద బాధితుల కోసం ఇచ్చేసి ఆచరణలో తన త్యాగ గుణాన్ని చాటాడు. వివరాల్లోకి వెళితే...గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రం వానలు, వరదలతో విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. ఎర్నాకులంలోని మఠాన్ చేరిలో నౌషద్ దుస్తులు విక్రయిస్తుంటాడు. ఆగస్టులో బక్రీద్ ఉందని ఈద్ మార్కెట్లో అమ్మకాల కోసం కొత్త దుస్తులు తెప్పించాడు. ఇందులో ఎక్కువ దుస్తులు మహిళలు, పిల్లలవే.
వరదలు ముంచెత్తడంతో కట్టుకోవడానికి దుస్తులతో పాటు, నిలువనీడ కోల్పోయి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. బాధితులను ఆదుకునేందుకు నటుడు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో కొంతమంది స్వచ్ఛంద సేవకులు సహాయ సామగ్రిని సేకరించి మలబార్ ప్రాంతానికి పంపుతున్నారు. ఈ విషయం నౌషద్ కు తెలిసి వెంటనే ఆ స్వచ్ఛంద కార్యకర్తలను తన దుకాణానికి రమ్మన్నాడు. అమ్మకాల కోసం తెప్పించిన ఐదు బస్తాల కొత్త దుస్తులను వారికి విరాళంగా ఇచ్చేశాడు.
నౌషద్ ఔదార్యం చూసి స్వచ్ఛంద కార్యకర్తలు విస్తుపోయారు. అనంతరం అతన్ని అభినందనలతో ముంచెత్తారు. నిన్న జరిగిన ఈ ఘటనను ఫేస్‌బుక్‍లో రాజేష్ పోస్ట్ చేశాడు. అంతే.. నౌషద్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపించారు. అంతేకాదు వరదలు తగ్గుముఖం పట్టాక నౌషద్‌ను కలుస్తామంటూ పలువురు ప్రముఖులు పోస్ట్ చేయడం గమనార్హం. దీనిపై నౌషద్ స్పందిస్తూ 'బక్రీద్ పండుగను ఇలా జరుపుకోవడం ఎంతో తృప్తిగా ఉంది' అన్నాడు.