Andhra Pradesh: ‘కొబ్బరిమట్ట’ సినిమాను మా ఊర్లో రిలీజ్ చేయరా?.. చిత్తూరులో సెల్ టవర్ ఎక్కిన సంపూ వీరాభిమాని!

  • ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘటన
  • ఈ నెల 10న విడుదలైన కొబ్బరిమట్ట
  • మదనపల్లెలో రిలీజ్ కాకపోవడంతో యువకుడి మనస్తాపం

సంపూర్ణేష్‌బాబు, ఇషికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమా ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబు నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాను తమ ప్రాంతంలో విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. జిల్లాలోని మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన డి.రామచంద్ర కుమారుడు రెడ్డెప్ప(23)  బైకుల మెకానిక్ గా పనిచేస్తున్నాడు. సంపూర్ణేశ్ బాబుకు అభిమాని అయిన రెడ్డెప్ప, తమ ప్రాంతంలో కొబ్బరిమట్ట సినిమా విడుదల కాకపోవడంతో అసహనానికి లోనయ్యాడు.

గత శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయాలని దర్శకుడు రూపక్‌ రొనాల్డ్‌సన్‌, నిర్మాత సాయి రాజేశ్‌ నీలంలను డిమాండ్ చేశాడు. అయినా వారు స్పందించకపోవడంతో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు రెడ్డప్ప స్థానిక అయోధ్యనగర్ లోని సెల్ టవర్ ఎక్కేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని రెడ్డెప్పతో ఫోన్ లో మాట్లాడారు.

కిందకు దిగాలని పోలీసులు కోరినా పట్టించుకోని రెడ్డెప్ప సాయంత్రం 6 గంటల వరకూ అక్కడే ఉండిపోయాడు. స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రెడ్డప్ప నానాహంగామా చేశాడు. ‘మిగిలిన హీరోల సినిమాలైతే విడుదల చేస్తారు..మా సంపూర్ణేష్‌బాబు చిత్రాన్ని ఎందుకు విడుదల చేయరు’ అని ప్రశ్నించాడు. దీంతో పోలీసులు రెడ్డెప్ప చిన్నమ్మ కుమారుడు ప్రశాంత్‌ను టవర్‌ ఎక్కించి కిందకు దింపే ప్రయత్నం చేశారు. చివరికి రెడ్డెప్పను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెడ్డెప్ప మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News