Vijayanagaram District: అవ్వకు ఆకలేసిందట.. కిందకు దూకేస్తానంది!
- మేడపై నుంచి దూకేందుకు ప్రయత్నం
- స్థానికుల సమాచారంతో వచ్చి రక్షించిన పోలీసులు
- ఆమెకు మతిస్థిమితం లేదని సమాచారం
ఆకలిగా ఉందని ఏకంగా మేడపై నుంచి దూకేస్తానంటూ పిట్టగోడ ఎక్కి కూర్చున్న ఓ వృద్ధురాలు కాసేపు అలజడికి కారణమైంది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం బందరు వీధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలావున్నాయి. వారణాసి భూదేవికి కొడుకులు లేకపోవడంతో కుమార్తెల సంరక్షణలో ఉంటోంది. అంతగా తిరగలేని పరిస్థితి, మతిస్థిమితం కూడా అంతంత కావడంతో కుమార్తెలు ఆమెకు మేడమీద ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. గదిలోకే అన్నీ సమకూర్చుతుంటారు. ఆదివారం ఉదయం ఎప్పటిలాగే ఆమె కుమార్తె ఉదయం అల్పాహారం అందించి పనుల్లోకి వెళ్లిపోయారు.
సాయంత్రానికి ఆకలి ఎక్కువ కావడంతో తట్టుకోలేని వృద్ధురాలు మేడపై నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నించింది. మెట్ల గేటుకు తాళం వేసి ఉండడంతో ఏం చేయాలో పాలుపోక పిట్టగోడపైకి ఎక్కి కూర్చుంది. కిందకు దూకినా, పడిపోయినా ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ మహిళా ఎస్‌ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిచ్చెన వేసి మేడపైకి చేరుకుని ఆమెను గదిలోకి పంపించారు. కొన్ని పండ్లు, ఆహారాన్ని ఆమెకు అందించారు. తిని సేదదీరాక వృద్ధురాలితో మాట్లాడారు. ఆకలి తట్టుకోలేకపోయానని, కిందికి దిగే మార్గం లేకపోవడంతో దూకేందుకు ప్రయత్నం చేశానని అమె చెప్పడంతో కంగుతిన్నారు. అయితే ఆమెకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.