Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షం!
- మధ్యాహ్నానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం
- పలు ప్రాంతాల్లో వర్షాలు
- హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు
నేటి మధ్యాహ్నానికి బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. సముద్రంపై ఈశాన్య ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించిందని, ఈ కారణంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణ, ఏపీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే చాన్సుందని అన్నారు. కాగా, నిన్న ఆదివారం పగటి సమయంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అయితే, భారీ వర్షాలు మాత్రం ఎక్కడా నమోదుకాలేదు.