YSRCP: రాయలసీమలో నీటి కరువు.. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి: నారా లోకేశ్
- రాయలసీమలో కరవు తాండవిస్తోంది
- సాగునీరే కాదు తాగునీరు కూడా లేని పరిస్థితి నెలకొంది
- ప్రజలకు గుక్కెడు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు
రాయలసీమలో నీటి కరువు గురించి ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. రాయలసీమలో కరవు తాండవిస్తోందని, దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం గత రెండు నెలలుగా ఇక్కడ నమోదైందని అన్నారు. సాగునీరు సంగతి తర్వాత, తాగునీరు కూడా లేని పరిస్థితి నెలకొందని, ప్రజలు గుక్కెడు నీళ్ళ కోసం, రోడ్డెక్కి ధర్నాలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
వైఎస్ జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, ప్రజలకు గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ‘మీ అవగాహనారాహిత్యానికి ప్రజలు ఇంకెన్నాళ్లు ఇబ్బందులకు గురవ్వాలి? ప్రజల పట్ల మరీ ఇంత ఉదాసీనతా?’ అంటూ జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ‘జలవాణి’ కార్యక్రమం ద్వారా, ట్రాక్టర్లతో నీటి సరఫరా జరిగేదని గుర్తుచేశారు. తమపై కోపంతో ఆ కార్యక్రమం కూడా ఎత్తేసినట్టు ఉన్నారని అన్నారు. మన నీళ్ళు ‘తెలంగాణా’కు తరువాత ఇవ్వొచ్చు, ముందు సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండని జగన్ కు సూచించారు.