Dosti: అమృతసర్ కు ఖాళీగా వచ్చిన 'దోస్తీ' బస్!
- ఆర్టికల్ 370 రద్దుపై పాక్ ఆగ్రహం
- నిన్న రాత్రి ఖాళీగా వచ్చిన బస్సు
- ఇప్పటికే బస్సు రద్దును ప్రకటించిన పాకిస్థాన్
జమ్మూకశ్మీర్ ను రెండుగా విడగొట్టడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పాకిస్థాన్, ఇప్పటికే సంఝౌతా ఎక్స్ ప్రెస్, థార్ ఎక్స్ ప్రెస్ లను రద్దు చేసిన పాక్, తాజాగా లాహోర్ - ఢిల్లీ మధ్య తిరిగే 'దోస్తీ' బస్ సర్వీసులనూ రద్దు చేసింది. ఢిల్లీ నుంచి శుక్రవారం నాడు బయలుదేరి వెళ్లిన బస్సు, నిన్న రాత్రి లాహోర్ నుంచి ఖాళీగా ప్రయాణించి అమృతసర్ కు చేరుకుంది.
కాగా, తమకు పాక్ అధికారుల నుంచి బస్ సర్వీసును రద్దు చేస్తున్నామని ఎటువంటి లిఖితపూర్వక ఉత్తర్వులూ ఇవ్వలేదని, బస్సులో ప్రయాణికులు ఎవరూ ఎక్కలేదని బస్ డ్రైవర్ వెల్లడించాడు. బస్సును తిప్పేందుకు అనుమతిని ఉన్నతాధికారులు నిరాకరించారని మాత్రం తమకు నోటిమాటగా చెప్పారన్నాడు.
ఇదిలావుండగా, బస్సును రద్దు చేసినట్టు పాకిస్థాన్ పోస్టల్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి మురాద్ సయీద్ ఓ ట్వీట్ లో వెల్లడించారు. నేషనల్ సెక్యూరిటీ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ బస్ ప్రయాణానికి ముందస్తు టికెట్లను బుక్ చేసుకున్న వారికి డబ్బులను తిరిగి చెల్లిస్తున్నామని అన్నారు. ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు బక్రీద్ నిమిత్తం వెళ్లే రద్దీని తట్టుకునేందుకు సంఝౌతా ఎక్స్ ప్రెస్ బోగీలను వినియోగిస్తున్నామని అన్నారు.