Hyderabad: హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్ లో 100 రోజులు మకాం... రూ. 12 లక్షల బిల్లు ఎగ్గొట్టి పరారీ!
- 102 రోజులు హోటల్ లో మకాం
- డబ్బులు ఎగ్గొట్టి పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు
- ఆరోపణలు అవాస్తవమంటున్న వ్యాపారి
హైదరాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ బంజారాలో 100 రోజులకు పైగా మకాం వేసిన ఓ వ్యక్తి, రూ. 12.34 లక్షల బిల్లును ఎగ్గొట్టి పారిపోగా, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. తాజ్ బంజారా హోటల్ మేనేజ్ మెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఏ శంకర్ నారాయణన్ అనే వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. తనను తాను ఓ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న శంకర్ నారాయణన్ అనే వ్యక్తి, వ్యాపార నిమిత్తం నగరానికి వచ్చానని, దీర్ఘకాలం పాటు ఉంటానని హోటల్ వారికి చెప్పాడు.
మొత్తం 102 రోజులు హోటల్ లో ఉన్నాడు. పలు దఫాలుగా రూ. 13.62 లక్షలు చెల్లించాడు. మొత్తం బిల్లు రూ. 25.96 లక్షలు కాగా, మిగతా మొత్తాన్ని ఎగ్గొట్టి పారిపోయాడు. ఆపై ఆయన తన మొబైల్ ఫోన్ ను సైతం స్విచ్చాఫ్ చేయగా, హోటల్ మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై కేసును నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి పీ రవి వెల్లడించారు. కాగా, తాను పారిపోయినట్టు వచ్చిన వార్తలపై నారాయణన్ స్పందిస్తూ, తాను మొత్తం బిల్లును కట్టిన తరువాతనే హోటల్ ను వీడానని, తన పరువు తీసేలా వ్యవహరిస్తున్న హోటల్ పై చట్ట పరమైన చర్యలను తీసుకుంటామని అన్నారు.