weather report: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు
- ఈరోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడా చిరుజల్లులు
- బంగాళాఖాతంపై రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావం
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
బంగాళాఖాతం పరిసరాల్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్లు, 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు కుదిపేసిన వర్షాలు, వరదలు శనివారం కాస్త తెరిపిచ్చిన విషయం తెలిసిందే. వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా నిన్న ఉష్ణోగ్రతలు కూడా పెరిగి ఉక్కపోత మొదలయ్యింది. అయితే దక్షిణాంధ్రపైన, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు రేపటికి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి.
దీని ప్రభావం వల్ల తెలంగాణలోను, ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిన్న తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడగా వికారాబాద్ జిల్లా దోమలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.